Latest News

శ్రీవారి ప్రణయ కలహోత్సవం...!!

loading...
కలియుగారంభములో వైకుంఠవాసుడైన శ్రీహరి ఈ భువికి భక్త సంరక్షణార్థం ఈ ఇలకు దిగివచ్చి వెంకటాచలం మీద కొలువు దేరాడు. అప్పటిలో తిరుమల శ్రీవారికి రాత్రి నైవేద్యం కాగానే పవళింపు సేవలు అవీ చేసాక ఆలయం తలుపులు మూసేవారు. ఆయనేమో తిరుచానూరులో ఉన్న అమ్మవారి వద్దకు వెళ్లేవారు. అమ్మవారు అక్కడ ఆయనకోసం వేచి యుంటూ అన్ని సేవలు అయ్యాక ప్రొద్దుటే సుప్రభాత సమయానికి తిరుమలకు చేరుకునేవారు స్వామి . ఒకనాడు మన అయ్యవారికి పవళింపు సేవ అవగానే ఆయనకు వేట మీద మనసు పడింది .. జగన్నాథుడు కదా ఏ దుష్టమృగాలను చూశాడో, దుష్ట రాక్షసులను గన్నాడో ఆయన వేటకు విల్లంబులు ధరించి తిరుమల అడవుల్లో సంచరించడానికి వెళ్ళాడు . వేటలో ఆనందంలో పడి అయ్యవారు అమ్మవారి వద్దకు వెళ్ళడానికి మరచిపోయాడు. తెలతెల్లవారుతుందేమో అన్నట్టు చూస్తే అమ్మవారి వద్దకు వెళ్ళడానికి మరచిపోయానే అని వేగంగా వెళ్ళిపోయాడు తిరుచానూరు . వెళ్లి అక్కడ తలుపులు తట్టాడు .. అమ్మవారు వేచి వేచి యుండి ఆయనకోసం చేసిన మధుర పదార్థాలన్నీ చల్లగా అయ్యాయి అని చూసి చూసి ఆమె అలుక వహించింది . తలుపు తట్టగానే అమ్మవారు సఖులతో కలసి వచ్చింది .. అయ్యవారిని అమ్మవారు ప్రశ్నించడం మొదలు పెట్టింది .
అమ్మవారు :
యెవ్వరోయి నీవెవ్వరివోయి
దారి తప్పి ఇటు వచ్చితీవో
ఈ వైపు రాకు ఇక పని ఏలనో
చాలు చాలు ఇక నీ వెక్కసపు మాటలు
అయ్యవారు :
పొలతిరో నీ ప్రియుడనే గాన
అలసితి నిలబడ కాళ్ళు రాకున్నవి
వేగమే తలుపు తీయగా రాదో
మాధవుడను తవ మదీయుడను
మాధవ నామానికి వసంతుడు మరియు మన్మథుడు అని కూడా పేరు కాబట్టి అమ్మవారు ఆయన్ని ఇలా దెప్పి పొడిచింది
అమ్మవారు :
అనంగుడివా ఇచట పనియేమి
వేళకాని వేళల ఇటు ఇళ్లు దూరా
సమయము కాదిది వెళ్లిరమ్మా
వలరాజులకిట తావులేదు పోపొమ్మా
శ్రీవారు నేను చక్రధారిని . అలసి పోయున్నాను దాహం వేస్తోంది తలుపు తీయవా అని బ్రతిమాలతాడు. అపుడు అమ్మవారు చక్రధారి అంటే కుమ్మరి అని కూడా అర్థం .. అయితే నీవు కుండలు చేసే కుమ్మరివాడివా .. ఇపుడు కొనడానికి లేదు మరో మారు రాపో అంటుంది. ఇక్కడ కుమ్మరి వాడు అంటే ఆయన సృష్టికర్త కదా. ఈ లోకములో ఉన్నవాటన్నింటినీ సృష్టించేది ఆయనే కదా? అలా అర్థములో కూడా అమ్మవారు శ్రీవారిని దెప్పిపొడిచింది. అయ్యో కాదు కాదు నేను భూభారం మోసేవాడను అంటారు పద్మావతీ అమ్మవారు భూదేవీ అవతారం కదా అలా అని ఆ అర్థములో ఆయన చెబుతాడు . మరి అమ్మవారేమి తక్కువ తిన్నదా ? అసలే రాచకన్య/.. దయ దాక్షిణ్యాలతో బాటు ముక్కు మీద ఉంటుంది కోపం ఆమెకు . అయితే భూమిని తలపై మోస్తున్నది సహస్ర శిరస్సుల ఆది శేషుడు కదా ? అయితే నీవు విష కీటకానివా .. నీకిక్కడ తావు లేదు పొమ్మంటుంది. కాదు కాదు దేవీ నేను హరి ని నీ స్వామిని .. చెమటలతో తడిసిపోతున్నాను ఇకనైనా తలుపు తీయవా అంటాడు శ్రీవారు. ఓ హరివా .. కొండ కోనల్లో తిరుగాడే మర్కటానికి ఇక్కడ పని ఏమి అంటుంది. హరి అంటే కోతి అని అర్థం కూడా కదా .. అలా పరాచికం ఆడుతుంది అన్నమాట. ఇలా అనేక విధాలా వాగ్వాదం జరిగాక అమ్మవారు తలుపు తీస్తుంది . స్వామి వారిని లోనికి రానీయకుండానే అడ్డు నిలబడి ఆయన రూపం ఎగా దిగా తేరిపారా చూసింది . తిరునామం చెదరి మధ్యలో ఉన్న ఎర్రని నామం ఆయన ఒంటిమీద అంతా అలదికొని ఉన్నది . జుట్టంతా చెదరి పోయున్నది .. శరీరం మీద గీరుకుపోయున్నది .. కళ్ళేమో ఎర్రగా ఉన్నాయి. పైగా ఆ రోజు ఏ భక్త పరమాణువు సుగంధం కస్తూరి సమర్పించుకున్నాడో సేవల్లో భాగంగా .. ఆ వాసన గుప్పుమంటోంది . అంతే అమ్మవారికి కోపం తీవ్రం అయింది .
ఏమిటీ అవతారం. ద్వాపరములోనే అనుకుంటే ఇపుడు కూడా ఇలా అయ్యావా .. కళ్లంతా ఎర్రబడియున్నాయి.. ఒళ్ళంతా గీతలున్నాయి ..ఏ పొలఁతి పెట్టిన గాటులో. జుట్టంతా చెదరి ఉంది .. ఏమిటా కుంకపు చిన్నెలు .. నీకు అత్యంత అలంకారమైన తిరునామమే చెదరి ఉంది . ఎవ్వరెరుగరు ఇదంతా .. నిజం చెప్పండి అంటూ స్వామి వారిని నిష్ఠురపు మాటలతో ప్రశ్నించ సాగింది.
దేవీ తిరుమల కొండల్లో తపస్సు చేసుకుంటున్న భక్తపరమాణువులకు ఇబ్బందులు కలుగకుండా అక్కడ ఉన్న దుష్ట మృగాలను తరిమి కొట్టడానికి వేటకై వెళ్ళాను . అక్కడ మహర్షులు అందరు శిలారూపాలై యున్నా.. ఈ దుష్ట మృగాల అరుపులకు వారికి తపోభంగం కలుగునేమో అని వాటిని వేటాడి వస్తున్నాను అంటాడు .
ఏ దిక్కుకు వెళ్లారో .. ఆ దిక్కునకు అధిపతి అయిన వాడి చేత సాక్ష్యం చెప్పించు అంటుంది అమ్మవారు . ఒక దిక్కని లేదు సమస్త దిక్కులకు వెళ్లాను అంటాడు స్వామి వారు. మరి కస్తూరి నామం చెదరిపోయిందేం ? అని ప్రశ్నిస్తుంది అమ్మ వారు. వేటాడడములో చెమట పట్టి. పైగా ఇక్కడకు రావాలని వేగంగా వస్తుంటే ఆ చెమటతో అది కరిగిపోయింది అంటాడు స్వామి వారు. మరి కళ్ళు ఎందుకు అంతగా ఎర్రగా ఉన్నాయి అంటుంది అమ్మవారు . వేటకు వెళ్ళాను పైగా నా రెండు కళ్లెప్పుడూ ఎర్రగానే ఉంటాయి కదా అంటూ తాను సూర్య శశాంక నయనుడను కదా అని చెబుతారు స్వామి . మరి ఏమిటా సుగంధం వాసనలు .. ఏమిటా ఎద మీద ముద్రలు, చేతులకు ఒంటి మీద గీరలు అంటూ లోనికి రానివ్వను పొమ్మంటుంది అమ్మవారు. అవి వేటాడేప్పుడు పూపొదలమాటున పొంచి ఉంటే ఏ పుష్పగుచ్చమో తగిలి దాని పూవుల పుప్పొడి గంధం అలముకుని ఉండి ఉంటుంది . వేటాడే సమయాన ఏ ముళ్లపొద నో తగిలి గీసుకుని ఉండి ఉంటుంది అంటారు శ్రీవారు. మరి వస్త్ర ధారణ మాములుగా ఉన్నట్టు లేదే .. ఏమిటి ఆదరాబాదరా కట్టుకుని వచ్చినట్టు ఉన్నావ్ . అసలేం జరిగింది నిజం చెప్పు అంటుంది అమ్మవారు . అయ్యో వేటలో వస్త్రాలు జారితే అలా దోపుకున్నాను అంటాడు స్వామి .. నా మీద అనుమానం ఒద్దు .. నీవేం చేయమంటావో చెబితే నా సత్యాన్ని నిర్పూపించుకుంటాను అంటాడు స్వామి .
నిన్ను ఇపుడు నమ్మించడానికి సముద్రములో దూకమందువా అని అంటారు స్వామి . అది నీకు అత్తవారిల్లు .. పైగా నీవు ఆ సముద్రాన్ని పావనం చేసిన మత్స్యావతారానివి కూడా ..పైగా క్షీర సాగర మధనంలో అక్కడ మందరగిరి వేసి తనిసినప్పుడు కూడా కూర్మావతారుడవై అక్కడే ఉన్నవాడివి. ఆ సముద్రుఁనికి నీకు స్నేహం పైగా అల్లుడివి .. ప్రళయం జరిగినపుడు తెప్ప మర్రాకు మీద శయనించావు అవి నాకు తెలియదనుకున్నావా .. జలాలు నిన్నేమీ చేయలేవు అందుకే ఇలా అంటున్నావు .. అక్కడ నీకేం కాదు పో అంటుంది .
మరి కాలకూట విషం తాగమందువా .. లేదా పాముల చేత కరపించుకొమ్మందువా నిన్ను నమ్మించడానికి అంటాడు స్వామి
ఆ ఆ... నాకు తెలియదనుకున్నావా . పూర్వం కృష్ణావతారంలో విషపూతన ఇచ్చిన విషపు పాలను గ్రోలి జీర్ణించుకున్న వాడివి. పైగా నీవు ఆ ఆదిశేషుడు నీకు బంటు.. పైగా నీవు అతని మీద శయనిస్తావు కదా . వాటి విషం నిన్ను ఏమి చేయగలుతుంది . నీ మాటలు నేను నమ్మలేనుపొమ్మంటుంది అమ్మవారు.
పోనీ అగ్ని దూకి నా సత్యాన్ని నిరూపించుకొమ్మందువా అంటాడు . ఆ అగ్ని నీ సోదరుడు అయిన ఇంద్రునికి అధీనములో ఉంటాడు అది నిన్ను ఏం చేయగలుగుతుంది. నీవు గరుడధ్వజముతో అక్కడకు వెళ్ళగానే అగ్ని నిన్ను గుర్తుపట్టి చల్లగా వీస్తాడు. ఇలాంటి పరీక్షలు నేను నమ్మలేను పొమ్మంటుంది
మరి నేను అబద్ధాలు ఆడుతున్నట్టు అయితే తులాభారం వేయి అంటాడు స్వామి. ఆ ఆ తెలుసు తెలుసు పూర్వం కృష్ణావతారంలో ఇలా చేసి మోసపోయాను . పద్నాలుగు జగాలను కడుపులో పెట్టుకున్న నిన్నెలా తూయగలను . అదే కదా నీ నమ్మకం అంటుంది అమ్మవారు .
దేవీ నేను పూర్వమే ఇనకులాన్వయములో బట్టి ఏక పత్నీ వ్రతము చేబట్టి ఒకే సతితో జీవించినవాడను .. గుర్తుందా అంటాడు స్వామి
ఆ ఆ తెలియకేం కృష్ణవతారములో ఎందరు సపత్నులతో వేగానో.. ఆ బాధ నాకింకా గుర్తు ఉంది.. మీ ఈమాటలు ఒట్టి బూటకాలు నమ్మలేనుపొమ్మంటుంది .
దేవీ .. నా మాట నమ్ము .. లక్ష్మీ దేవి నిలయం అయిన ఈ కౌస్తుభం మీద ఒట్టు .. నేను నిజముగా వెళ్ళింది వేటకే .. మహర్షుల సంరక్షణార్థమే వెళ్ళాను అంటాడు స్వామి
అయితే నిన్న నా చెలులతో ఆడేప్పుడు మా పూల బంతి ఎక్కడో పడిపోయింది దానిని తీసుకురండి.. స్నానం చేయించి .మంచి దుస్తులు కట్టుకుని అలంకరిస్తాను . ఇంక నుండి బుద్ధిగా ఎక్కడకు వెళ్లినా నాతో చెప్పే వెళ్ళండి. అపుడు మకరము బారిన బడిన గజేంద్రుని సంరక్షణార్థం కూడా ఇలాగే చెప్పకుండా పోయి బెంబేలెత్తించారు . అని స్వామి వారు తెచ్చి ఇచ్చిన పూబంతిని చూసి .. ఇది నేను ఆడిన పూబంతి కాదు .. నీవెవ్వరితో ఇచ్చకాలు ఆది వస్తున్నావో .. నిజం చెప్పు లేదా అడుగు కూడా లోపలకు వేయనివ్వను . సఖులారా నేను వెళ్లగొట్టలేకున్నాను .. మీరు ఈయనను త్వరగా ఇక్కడ నుండి వెళ్ళగొట్టండి అంటుంది అమ్మవారు.
అయ్యో అయ్యో దేవీ .. అటు చూడు .. మన ప్రణయ కలహం ప్రత్యక్షంగా చూడాలని వచ్చిన శఠగోప సూరి ఇది అంతా చూస్తున్నాడు . అపరాధిని అయిన నన్ను కనీసం ఆయనకోసం అయినా క్షమించు . మళ్లీ ఇలాంటివి జరుగకుండా చూస్తాను . ఇప్పటికి అయినా క్షమించవా అని అడుగుతాడు శ్రీవారు .
అపుడు ఇదంతా చూస్తున్న శఠగోప సూరి అమ్మవారిని వేడుకుని శ్రీవారు తనకు ఈ ప్రణయ కలహ దర్శనం ఇప్పించడానికి ఆడిన నాటకమే ఇది . కావున నమ్మి అయ్యవారిని క్షమించమంటాడు భక్తితో .
స్వామీ శఠగోపసూరి అంత ఉన్నతుడు వచ్చి వేడుకుంటే కరుణించకుండా ఉంటానా..ఇప్పుడు నాకోపం పోయింది సరి సరి లోనికి వెళ్లి స్నానాదులు చేసి మంచి వస్త్రాలు కట్టి ఇంక మాధవుడనే నామముతో నాకు నచ్సినట్టు మెలుగుతూ ఉండండి అంటుంది .
దేవీ .. నీకో విషయం చెప్పనా! నాకున్న అనంత నామాలలో మాధవుడు అని పిలిస్తే కలిగే ఆనందం ముందు వేరే పేర్లు కలిగించవు . నీ పతిగా నన్ను భక్తులు గుర్తిస్తే కలిగే ఆనందం అంతా ఇంతా కాదు .. నీ పాదాల వద్ద అలంకరించుకున్న నా శిరస్సు ను వంచుతున్నాను . ఇదే నాకు ప్రియం సుమా అంటూ స్వామి వారు అమ్మవారి పాదాలను ఒత్తడం ఆరంభిస్తాడు. నేనెప్పటికీ నీ విధేయుడనే అంటూ స్వామి వారు పలుకగా అయ్యవారిని సేవిస్తూ అమ్మవారు ఆతిథ్యం ఇవ్వడానికి లోనికి తీసుకువెళ్లారు చివరకు .
loading...

No comments:

Post a Comment

Teenmar News | Online English, Telugu,Telangana News Portal Designed by Templateism.com Copyright © 2014

Powered by Blogger.