Latest News

మొజాంజాహి మార్కెట్ గురించి నా చిన్నప్పుడు తాతయ్య చెప్పిన ముచ్చట్లు...!!

loading...
ఆ గుబాళింపులు..
ఆ ఘుమాయింపులు.
పురానాషహర్ గోపురాన,
నిలువెత్తు గడియారాన్ని తలకెత్తుకుని,
ఇప్పటికీ తలెత్తుకుని,
గతస్మృతులనెన్నిటినో
తలపింపజేసే,
మొజాంజాహీ మార్కెట్టు..
కుతుబ్‌షాహీ కాలానికీ నేటికీ,
సజీవంగా అనుసంధానించే ప్రామాణిక.🌺🌺
అలనాటి రాచవైభోగమూ,రాణీవాసప్రాభవమూ,
ఇపుడు మనకళ్ళకు కానరాకపోవచ్చు!
కానీ పరికించిచూసే నయనాలకూ,వినికించి వినే శ్రవణాలకూ,
ఆఘ్రాణించగలిగే నాసికలకూ,
ఇప్పటికీ అలనాటి అపురూప అందాలూ,
సుగంధపరిమళ చందాలూ,
సదృశ్య,శ్రవణ,ఆఘ్రాణితాలే!
మొజాంజాహీమార్కెటు కూడలినుంచి మొదలెడితే,,
అక్కడే అప్పుడే పూదోట విలసిల్లి పూసిందాయన్నట్టు,
అన్నిరకాల పూవులూ వన్నెలద్దుకుని,
సాయంకాలవేళల్లో పైనున్న బల్బుల వెలుగుల్లో,
మెరుపుఉడుపుతొడుక్కున్న కన్నెపిల్లల్లా మెరుస్తూ,
నేటికీ పూలహారాలు నేత్రపర్వమే!
అన్నిరకాల పళ్ళూ వాటికి సైజోడుగా ఉండడమూ అదనపు ఆకర్షణ..🌺🌺
ఇగ రెండడుగులేస్తే
ఘుమఘుమలాడుతూ అల్లంవెల్లుల్లి వాసనలు మనల్నాపుతాయ్!
ఆరుబయట ఆరబోసినట్టు అన్నిరకాల మసాలా దినుసులు,
ఆకళింపజేస్తాయ్!
మసీదులోని ఆజాన్ పిలుపు ఓవైపు మదికి స్వాంతనచేస్తుండగా,
మరోవైపు ప్రక్కనే ఇత్తడీ,రాగీ,రాతెండి డేగిషలూ,గంగాళాలూ,
అంతెత్తువరసలో కొలువుదీరుతాయ్!
చిన్నాచితకా,బడావ్యాపారుల చిలవలపలువల బాతాఖానీలు,
వరదలైపారుతాయ్!
వాటితోబాటే గంగాజమునల తెహజీబులూ పారుతాయ్!
ఇరానీచాయ్,బిస్కట్టులతో పరిచయాలూ పెరుగుతాయ్!🌺🌺
ఇంకొక్క అడుగేయగానే స్వర్గద్వారందగ్గరున్నామా అనేంతగా,
ముక్కుపుటాల్లోంచి నేరుగా గుండెతలుపుల్లోకి చొచ్చుకుపొయేట్టు,
అత్తరువాసన జన్నతుల్ ఫిరదౌజ్ ఆ చోటునంతా అల్లకుంటుంది!
వరుసగా పేర్చినట్టున్న అత్తరు షాపులెన్నో,
సలాంచేస్తూ తష్రీఫ్ చేయమంటాయ్!🌺🌺
రూమీటోపీల ధగధగలూ,చమ్కీటోపీల మిలమిలలూ,
విద్యుద్దీపాలతో పోటీపడి,
భాగ్యనగరవైభవాన్నీ,పురానాషహర్ షాన్ నీ
ఆకాశంలోని చుక్కలకే చుక్కల్ని చూపిస్తాయ్!
దేవిడీలూ,హవేలీలూ,వాటివసారాల్లోని చెక్కనగిషీలతో,
చెక్కుచెదరని ఆపాతవైభోగాన్ని ఆసాంతం,
మనముందు ఆవిష్కరిస్తాయ్🌺🌺
గోడలూ,వాటిరంగులూ వెలసిపోవచ్చు!
నగిషిలూ,బురుజులూ బూజుపట్టివుండొచ్చు!
కానీ ఒరేయ్ అంటే భాయీ అని పిలుచుకునే,
సంప్రదాయసంస్కారమ్మాత్రం,
అదుగో ఆ జన్నతుల్ ఫిరదౌజ్ అత్తరుమల్లే,
పవిత్రంగా నేటికీ ప్రతీహైద్రాబాదీలోనూ,
గుబాలిస్తూనే ఉంటుంది..🌺🌺
చార్ సౌ సాల్ షహరే కాదు...
చార్ హజార్ అయినా...
ప్రతీ హైద్రాబాదీ హిందూముస్లిం గంగాజమునల సంగమమే..
ఈ తహజీబును విడదీయడం,
మానవమాత్రులకే కాదు..
ఆదేవుడివల్లనూ కాలేదు....❤️❤️
loading...

No comments:

Post a Comment

Teenmar News | Online English, Telugu,Telangana News Portal Designed by Templateism.com Copyright © 2014

Powered by Blogger.