Latest News

హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది..?

loading...

ఉత్తరభారతదేశంలో క్రీ.శ. 16వ శతాబ్దంలో జీవించిన సంత్ తులసీదాస్ ను సాక్షాత్తు వాల్మీకిమహర్షి అవతారంగా భావిస్తారు. భవిష్యత్ పురాణంతో శివుడు పార్వతితో, కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి, ఓ ప్రాంతీయ భాషలో రామకథను ప్రచారం చేస్తాడని చెబుతాడు. తులసీదాస్ రచించిన 'రామచరితమానస' సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకథను సుపరిచితం చేసింది. వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసీదాస్ నిరంతరం రామనామామృతంలో తేలియాడుతుండేవాడు. వారి సన్నిధిలో చాలామందికి అనేక మహిమలు ద్యోతకమయేవి. ఆ ప్రభావంతో ఎందరో అన్య మతస్థులు సైతం అపర రామభక్తులుగా మారుతుండేవారు. సమకాలీనులైన ఇతర మతపెద్దలకు ఇది రుచించలేదు. తులసీదాస్ మతమార్పిడులకు పాల్పడుతున్నాడని మొగల్ చక్రవర్తి అక్బర్ పాదుషాకు తరచుగా ఫిర్యాదులు చేస్తుండేవారు. కానీ, అక్బర్ అంతగా పట్టించుకోలేదు.
ఇదిలా వుండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడయిన గృహస్తు, తన ఏకైక కుమారునికి ఓ చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు. వారిద్దరూ ఆనందంగా జీవనం సాగిస్తుండగా, విధి వక్రించి ఆయువకుడు కన్నుమూశాడు. జరిగిన దారుణానికి తట్టులేకపోయిన అతని భార్య హృదయవిదారకంగా విలపించసాగింది. చనిపోయిన యువకునికి అంత్యక్రియలు జరుగకుండా అడ్డుపడుతూ రోదిస్తున్న ఆమెను, బంధువులంతా బలవంతంగా పట్టుకొని వుండగా, శవయాత్ర సాగిపోతున్నది. స్మశానానికి వెళ్ళేమార్గం తులసీదాస్ ఆశ్రమం మీదుగానే సాగుతుంది. శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చే సమయానికి తనను పట్టుకొన్నవారిని వదిలించుకుని పరుగుపరుగున ఆమె ఆశ్రమంలోకి చొరబడి తులసీదాస్ పాదాలపై పడి విలపించసాగింది. ధ్యాననిమగ్నులైన తులసీదాస్ కనులు తెరిచి 'దీర్ఘసుమంగళిభవః' అని దీవించాడు. దానితో ఆమె కడుదీనంగా జరిగిన సంగతిని వివరించి, జరుగుతున్న శవయాత్ర చూపించింది. వెంటనే తులసీదాస్ తల్లీ! రాముడు నా నోట అసత్యం పలికించడు! అని శవయాత్రను ఆపి, శవం కట్లు విప్పించి రామనామాన్ని జపించి, తన కమండలంలోని జలాన్ని చల్లాడు. ఆ మరుక్షణం ఆ యువకుడు పునర్జీవితుడయ్యాడు.
ఈ సంఘటనతో తులసీదాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగిన రామ భక్తులుగా మరేవారి సంఖ్య నానాటికి ఎక్కువ కాసాగింది. ఇక ఉపేక్షించితే కుదరదని ఇతర మతపెద్దలంతా ఢిల్లీకి వెళ్ళి పాదుషాకు స్వయముగా వివరించి తగిన చర్యను తీసుకోవలసినదిగా ఒత్తిడి తెచ్చారు. ఢిల్లీ పాదుషా తులసీదాస్ ను విచారణకు పిలిపించాడు. విచారణ ఇలా సాగింది.
పాదుషా :- తులసీదాస్ జీ ! మీరు రామనామం అన్నిటి కన్న గొప్పదని ప్రచారం చేస్తున్నారట !
తులసీదాస్ :- అవును ప్రభూ ! ఈ సకల చరాచర జగత్తుకు శ్రీరాముడే ప్రభువు ! రామ నామ మహిమను వర్ణించటం ఎవరి తరము?
పాదుషా :- అలాగా ! రామనామంతో ఎటువంటి పనినైనా సాధించగలమని చెబుతున్నారు. నిజమేనా?
తులసీదాస్ :- అవును ప్రభూ ! రామనామానికి మించినదేమీ లేదు.
పాదుషా:- సరే, మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాము. దానిని మీ రామనామం ద్వారా బ్రతికించండి. అప్పుడు మీరు చెప్పినదంతా నిజమని నమ్ముతాము.
తులసీదాస్ :- క్షమించండి ప్రభూ ! ప్రతి జీవి జనన మరణాలు జగత్ప్రభువు ఇచ్చానుసారం జరుగుతాయి. మానవమాత్రులు మార్చలేరు.
పాదుషా :- తులసీదాస్ జీ! మీ మాటను నిలుపుకోలేక, మీ అబద్ధాలు నిరూపించకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు. మీరు చెప్పినవన్నీ అబద్ధాలని సభాముఖంగా అందరిముందు ఒప్పుకోండి.
తులసీదాస్ :- క్షమించండి ! నేను చెప్పేది నిజం !
పాదుషాకు పట్టరాని ఆగ్రహం వచ్చి, 'తులసీ ! నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. నీవు చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పి ప్రాణాలు దక్కించుకో! లేదా శవాన్ని బ్రతికించు!' అని తీవ్రస్వరంతో ఆజ్ఞాపించాడు. అప్పుడు తులసీదాస్ కనులు మూసుకుని ధ్యాన నిమగ్నుడై శ్రీరామచంద్రుని స్మరించి ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని ప్రార్థించాడు. అది రాజ ధిక్కారంగా భావించిన పాదుషా తులసీదాస్ ను బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు. అంతే ! ఎక్కడి నుంచి వచ్చాయో వేలాదికోతులు సభలోకి ప్రవేశించి తులసీదాస్ ను బంధింప వచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలను లాక్కొని, వారిపై గురిపెట్టి కదలకుండా చేసాయి. ఈ హఠాత్ సంఘటనతో అందరూ హడలిపోయి, ఎక్కడి వారు అక్కడ స్థాణువులై పోయారు. ఈ కలకలానికి కనులు విప్పిన తులసీదాస్ కు సింహద్వారంపై హనుమంతుడు దర్శనమిచ్చాడు. ఒడలు పులకించిన తులసీదాస్ ఆశువుగా 40 దోహాలతో స్తోత్రం చేశాడు.
ఆ స్తోత్రంలో ప్రసన్నుడైన హనుమంతుడు 'తులసీ ! నీ స్తోత్రంతో మాకు చాలా ఆనందమైంది. ఏమికావాలో కోరుకో!' అన్నాడు. అందుకు తులసీదాస్ 'తండ్రీ! నాకేమి కావాలి ! నేను చేసిన నీ స్తోత్రం లోక క్షేమం కొరకు ఉపయోగపడితే చాలు, నా జన్మచరితార్థమవుతుంది. నా ఈ స్తోత్రంలో నిన్ను ఎవరు వేడుకున్నా, వారికి అభయం ప్రసాదించు తండ్రీ!' అని కోరుకున్నాడు.
ఆ మాటలతో మరింతప్రీతి చెందిన హనుమంతుడు 'తులసీ! ఈ స్తోత్రంతో మమ్ములను ఎవరు స్తుతించినా, వారి రక్షణ భారం మేమే వహిస్తాము' అని వాగ్దానం చేశారు అప్పటినుండి ఇప్పటివరకు'హనుమాన్ చాలీసా' కామధేనువై భక్తులను కాపాడుతూనే ఉంది.అపర వాల్మీకియైన తులసీదాస్ మానవాళికి ఈ కలియుగంలో ఇచ్చిన అపురూప కానుక 'హనుమాన్ చాలీసా'. దాదాపు 500 ఏళ్ళ తరువాత కూడా ప్రతిఇంటా హనుమాన్ చాలీసా పారాయణ, గానం జరుగుతూనే ఉంది. ఆయన వెలిగించిన అఖండ రామజ్యోతి వెలుగుతూనే ఉన్నది.
loading...

No comments:

Post a Comment

Teenmar News | Online English, Telugu,Telangana News Portal Designed by Templateism.com Copyright © 2014

Powered by Blogger.