Latest News

Sir Mokshagundam Visvesvarayya History

loading...
భారతదేశపు ప్రముఖ ఇంజనీరు, పండితుడు, రాజనీతిజ్ఞుడు, బహుముఖ మేధావి మైసూరు సంస్థానానికి 1912 నుండి 1918 దివాను మోక్షగుండం విశ్వేశ్వరయ్య వర్ధంతి ఏప్రియల్ 12.. సామాన్యుడు నుండి అసామాన్యుడుగా ఆయన సాధించిన సోపానాలు ఓ సారి మనం చదివి తరించాల్సిందే..
కెకెవి నాయుడు.
అది బెంగళూరుకు 38 మైళ్ళ దూరంలో ఉన్న ముద్దనహళ్ళి గ్రామం. 1861 సెప్టెంబరు 15న శ్రీనివాసశాస్త్రి, వెంకటమ్మ అనే అతి సామాన్య మధ్యతరగతి దంపతులకు ఓ బిడ్డ జన్మించాడు.ఆతనికి తల్లిదండ్రులు మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనే నామకరణం చేసారు. తండ్రి గొప్ప సంస్కృత పండితులు, ఆయుర్వేద వైద్యులు.
ఈయన విద్యా భ్యాసం చిక్కబళ్ళాపూరులో ప్రారంభమైంది. విద్యాభ్యాసంలో విశ్వేశ్వరయ్యను ప్రోత్సహించిన వారిలో మొదటిగా నాదముని నాయుడు, మేనమామ హెచ్‌.రామయ్యలను చెప్పుకోవచ్చు.
15వ ఏటనే ఈయన తండ్రి చనిపోవడంతో అనేక ఆర్థిక ఇబ్బందులకు లోనయ్యారు. పిల్లలకు ప్రైవేట్లు చెబుతూ, మేనమామ ఇంట్లో భోంచేసేవారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి తన 20వ ఏట, బెంగళూరు సెంట్రల్‌ కాలేజీ నుంచి బీఏ పరీక్షను డిస్టింక్షన్‌లో పాసయ్యారు.
ఇంతటి విశిష్ట ప్రతిభ కనబర్చిన విశ్వేశ్వరయ్యకు సెంట్రల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ వెబ్‌స్టరు ఎంతో ప్రోత్సాహమిచ్చారు. ఆయన క్రమశిక్షణకు, ముఖ్యంగా ఆంగ్ల భాష, లెక్కల్లో చూపిస్తున్న అసామాన్య పాండిత్యానికి ముగ్ధుడై అనేక బహుమతులు ఇచ్చారు. అంతేకాక ఉన్నత విద్యాభ్యాసానికి ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ప్రిన్సిపల్‌, అప్పటి మైసూరు రాజ్య దివాను రంగాచార్యుల సహాయంతో ప్రభుత్వ ఉపకారవేతనం అందేది. దీంతో పూనేలోని ఇంజినీరింగ్‌ కాలేజీలో తన విద్యాభ్యాసం కొనసాగిం చారు. ఇంజనీరింగ్‌ విద్యలో ఎంతో ప్రతిభ కనబరుస్తూ 1883లో ఉత్తీర్ణులైన వారందరిలోకి ప్రథమంగా నిలిచారు.
1884లో ముంబయి పి.డబ్ల్యూడీ శాఖ అసిస్టెంట్‌ ఇంజనీరుగా నేరుగా నియమితులయ్యారు. 1884 నుంచి 1909 మధ్య కాలంలో, ఇరిగేషన్‌ ఇంజనీరుగా, శానిటరీ ఇంజనీరుగా అనేక కార్యక్రమాలు చేపట్టి, నిర్ణీత కాలం కంటే ముందుగా పనులు పూర్తి చేసారు.
బొంబాయి రాష్ట్ర ప్రభుత్వ అధికారిగా ఎన్నో నగరాలకు రక్షిత మంచినీటి సరఫరా, మురుగునీటి రవాణా, వరద నివారణ పథకాలను అతి తక్కువ కాలంలోనే పూర్తి చేశారు. పూనే నగరానికి మంచినీటి సరఫరాకు నిర్మించిన ''వై ఫీ'' సరస్సు ఆటోమేటిక్‌ ఫ్లడ్‌ గేట్లను స్వయంగా రూపొందించి, నిర్మించారు. పైగా అతి తక్కువ ఖర్చుతో ఈ సరస్సులో నీటి నిల్వ శక్తిని పెంచారు. ఈ పనితీరుకు మన దేశంలోనే కాక ఐరోపా దేశంలోని నిపుణులు సైతంఆశ్చర్యపోయారు.
1909లో స్వచ్ఛందంగా సూపరింటెండింగ్‌ ఇంజనీరు పదవికి రాజీనామా ఇచ్చి విదేశీ పర్యటనలు చేశారు.
దాదాపు 70 ఏళ్లకు పైగా శ్రమించి, దేశంలోని దాదాపు అన్ని ముఖ్య నగరాలకు రక్షిత మంచినీటి సరఫరా, మురుగునీటి నిర్మూలన, వరద నివారణ పథకాలను పూర్తి చేశారు. 1918 నాటికి, దేశంలోకెల్లా అతి పెద్దదైన కృష్ణరాజ సాగర జలాశయాన్ని కావేరీ నదిపై నిర్మించారు.
ఈ ఆనకట్ట మైసూరు సంస్థానంలో లక్షలాది ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం కల్గించింది. అనేక గ్రామాలకు విద్యుత్‌ కొరత తీర్చి, మైసూరు ఆర్థిక స్వరూపాన్నే మార్చివేసింది. ఇరిగేషన్‌ ఇంజనీరుగా విశ్వేశ్వరయ్య సాధించిన ఘనవిజయమిది. సలహాదారు ఇంజనీరుగా (కన్సల్టెంట్‌) దేశంలోనే అతిపెద్ద సంస్థానాలైన బరోడా, గ్వాలియరు, ఇండోరు, భోపాల్‌, కోల్హాపూరు ల్లోనూ, అతిపెద్ద నగరాలైన బొంబాయి, కరాచీ, నాగపూర్‌లలో పనిచేసి ఎన్నో పథకాలకు కారకులయ్యారు.
మూసీ నదివల్ల వరదల పాలైన హైదరాబాద్‌ నగరానికి అవసరమైన మురుగునీటి పారుదల, వరద నివారణ పథకాలు పూర్తిచేశారు.
మైసూరు మహారాజా ఆహ్వానం మేరకు సంస్థాన సమగ్రాభివృద్ధికై 1909లో చీఫ్‌ ఇంజనీరుగా బాధ్యతలు స్వీకరించారు. అయితే తన జీవితాశయాలైన పరిశ్రమల స్థాపన, విద్యాభివృద్ధి, ముఖ్యంగా సాంకేతిక విద్యావ్యాప్తి వంటి అనేక కార్యక్రమాలకు రాజావారు సహకరించి ఆమోదముద్ర వేయాల్సిఉంటుందనే షరతులపై అంగీకరించారు. వారి నేతృత్వంలో మైసూరు కేవలం ఆరేళ్లలోనే అన్ని రంగాలలో ముఖ్యంగా పరిశ్రమల స్థాపన, సాంకేతిక విద్యావ్యాప్తి, నూతన రైలు మార్గాల నిర్మాణాలలో సత్వర ఆర్థికాభివృద్ధి సాధించింది. దీంతో ఆయనకు మైసూరు ప్రధాని(దివాను) పదవి వరించింది.
భద్రావతి ఉక్కు కర్మాగారం నష్టాల ఊబిలో వున్నప్పుడు దాని చైర్మన్‌గా అదనపు బాధ్యతలు స్వీరించి, ఆ సంస్థను పునర్‌ వ్యవస్థీకరించారు. అతి తక్కువ కాలంలోనే ఆ సంస్థను లాభాల్లో నడిపించారు. ఇది ఆర్థిక వేత్తగా విశ్వేశ్వరయ్య సాధించిన అపూర్వ విజయం. అందుకు మహారాజా వారు లక్ష రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు. దానికి తన స్వార్జిత సొమ్ము కొంత చేర్చి సుమారు లక్షన్నర రూపాయల వ్యయంతో మహారాజు పేరుమీద బెంగళూరులో ఇంజనీరింగ్‌ కాలేజీ స్థాపించారు. వీటితో పాటు పాలిటెక్నిక్‌ కళాశాల మైసూరు విశ్వవిద్యాలయం, ఇంజనీరింగ్‌ కళాశాల వంటి విశ్వ విద్యాలయాలు, మైసూరు శ్యాండిల్‌ సబ్బు ఫ్యాక్టరీలు వంటి ఎన్నో పరిశ్రమలు, స్థాపించడమే కాక పరిపాలనా సంబంధ సంస్కరణలను ప్రవేశపెట్టారు.
మోక్షగుండం విశ్వేశ్వరయ్య మేధాశక్తికి గాను1911లో సిఐఇ, 1915లో కెపిఐఇ మొదలగు అత్యున్నతమైన బిరుదులు లభించాయి. 1955లో 'భారతరత్న' బిరుదు వరించింది. 1938 నుంచి 1958 మధ్యకాలంలో దాదాపు 8 విశ్వ విద్యా లయాలు గౌరవ డాక్టరేట్ పట్టాలు ఇచ్చాయి. అంతేగాక 1941లో 'ఆల్‌ఇండియా మాన్యుఫాక్చరర్స్‌ ఆర్గనైజేషన్‌' సంస్థకు అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1959లో రైల్వేబోర్డు చైర్మన్‌గా బీహారు రాష్ట్రంలో గంగానదిపై రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి స్థలం నిర్ణయించి వంతెన నిర్మించారు.
అమెరికా, జపాన్‌ ఇతర ఐరోపా దేశాలను అనేకసార్లు సందర్శించి మన దేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధిపరిచేందుకు, సాంకేతిక అభివృద్ధి సాధించేందుకు ఎన్నో సూచనలు చేశారు.
వీరి రచనలలో 'మెమొరీస్‌ ఆఫ్‌ మై వర్కింగ్‌ లైఫ్‌, రీ కన్‌స్ట్రక్టింగ్‌ ఇండియా, ప్లాన్డ్‌ ఎకానమీ ఫర్‌ ఇండియా' అనేవి ముఖ్యమైనవి.
ఆంధ్ర, మైసూరు, బెనారస్‌ విశ్వ విద్యాలయాలతో పాటు అనేక విశ్వవిద్యాల యాలలో స్నాతకోపన్యాసాలు ఇచ్చారు.
నవభారత నిర్మాణంలో ఖాదీ, కుటీర పరిశ్రమల స్థాపన ద్వారా సత్వరాభివృద్ధి సాధ్యం కాదని, కేవలం భారీ పరిశ్రమల స్థాపన ద్వారానే లక్ష్యసాధన సులభమని నేరుగా గాంధీతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి వాదించిన ధీశాలి విశ్వేశ్వరయ్య.
1955 లో ఆయనకు భారతదేశపు అత్యున్నత పురస్కారమైన భారతరత్న లభించింది. ఆయన ప్రజలకు చేసిన సేవలకు గాను బ్రిటిష్ ప్రభుత్వం తరపున ఐదవ కింగ్ జార్జి నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ బిరుదునిచ్చి సత్కరించాడు. భారతదేశంలో ఆయన జన్మదినమైన సెప్టెంబరు 15 ను ఇంజనీర్స్ డేగా జరుపుకుంటారు.
తనకు భారత ప్రభుత్వం 'భారతరత్న' బిరుదు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుసుకుని అప్పటి ప్రధాని నెహ్రూకు 'మీరు నాకు 'భారతరత్న' బిరుదు ప్రసాదిస్తే నేను మీ ప్రభుత్వ విధానాలను ప్రశంసిస్తానని భావిస్తే చాలా పొరబడినవారవు తారు' అని నిర్భీతిగా తెలిపిన ధీశాలి ఈయన.
తుదిశ్వాస విడిచే వరకు నిస్వార్థ చింతనతో దేశానికి సేవ చేసిన ధన్యజీవి మోక్షగుండం విశ్వేశ్వరయ్య.

విశ్వేశ్వరయ్య వ్యక్తిగత జీవితం అతి క్రమశిక్షణతో వుండేది. రెండు సార్లు భార్యావియోగం కల్గింది. మూడోసారి పెళ్ళాడిన భార్య వ్యవహారం నచ్చక ఆమెకు విడాకులిచ్చారు. కాల నియమాన్ని, ఆహార విహార నియమాలను కచ్ఛితంగా పాటించిన విశ్వేశ్వరయ్య 100 సం. వయస్సులో కళ్ళద్దాలు లేకుండా చదివేవారు. "గంధపు చెక్క వలె సేవలొ అరిగిపో, కాని ఇనుములా తుప్పు పట్టవద్దు." అనునది వారి జీవన ధ్యేయం. దేశ విదేశాలలోని విశ్వవిద్యాలయాలు వారిని సత్కరించాయి. 1961లో విశ్వేశ్వరయ్య గారి శతజయంతి ఉత్సవాలకు భారత ప్రధాని నెహ్రూ విచ్చేశారు." మేము మాటలతో కాల యాపన చేశాం. మీరు నిరంతర క్రియాశూరులై నవభారత నిర్మాణానికి కృషి చేసిన మహనీయు" లంటూ నివాళులర్పించారు నెహ్రూ.
"ప్రజల సంపాదనాశక్తిని, కార్యదక్షతను నైపుణ్యాన్ని వివిధములైన చేతిపనుల ద్వారా పెంపొందించాలి. చేతనైన వారందరూ కష్టించి పని చేసే వీలు కల్పించాలి. యాంత్రిక శక్తిని ఉపయోగించుకుని దేశ పారిశ్రామిక ప్రగతికి ముందంజ వేయాలి. భారతీయులలో ప్రబలంగా ఉన్న 'అంతా తలరాత' అన్న భావం రూపుమాపి నిరంతర కృషి ద్వారా సంపదను సాధించే దీక్షను, కర్తవ్య పాలనను ప్రజలలో రేకెత్తించుట ప్రభుత్వం కర్తవ్యం."
1912 మైసూరు సంస్థాన దివానుగా అధికారాన్ని చేపడుతూ శ్రీ విశ్వేశ్వరయ్య చెప్పిన మాటలు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికైనా నిత్య సత్యాలే... ఆయనకు ఘన నివాళి.
loading...

No comments:

Post a Comment

Teenmar News | Online English, Telugu,Telangana News Portal Designed by Templateism.com Copyright © 2014

Powered by Blogger.