loading...
కబడ్డీ…భారతదేశంలో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు విస్తరించిన క్రీడ. ఖండాతరాల్లోఅభిమానులను సొంతం చేసుకున్న ఆట. కొన్నేళ్ల క్రితం ప్రభావం కోల్పోయిన ఆట. ఒక్క ప్రపంచ కప్ తప్ప మరే ఇతర టోర్నమెంటుల్లో ఈ కబడ్డీ ఆట కనిపించదు.ఈ దేశీయ క్రీడ అంతరించిపోకూడదని భావించిన కొందరు కార్పోరేట్ వ్యక్తులు మళ్లీ కబడ్డీని వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రో కబడ్డీ పేరుతో అటు ఆట పరంగా ఇటు రెవెన్యూ పరంగా విజయం సాధించారు. క్రీడాకారులు కూడా ఆర్థికంగా స్థిరపడేందుకు దోహదపడ్డారు. కబడ్డీ ఘనకీర్తిని మళ్లీ ఖండాంతరాలు వ్యాపింప జేశారు.
ఈ నెలలో భారత జట్టు కబడ్డీ ప్రపంచకప్ గెలవడంతో దేశమంతా సంబురాలు చేసుకుంది. కానీ ఆ సంతోషం ప్రజలకు మాత్రమే సొంతమైంది. కష్టపడి చెమటోడ్చి నెగ్గిన కబడ్డీ జట్టులోని కుర్రాళ్లకు మాత్రం చీకటినే మిగిల్చింది. ఇందుకు కారణం తగినంత ప్రోత్సాహకం ఇవ్వకపోవడమే. రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన పీవీ సింధూకు రూ.13 కోట్లు నగదు బహుమతుల రూపంలో ఇచ్చారు. అత్యంత ఖరీదైన బీఎండబ్ల్యూ కార్లు ఒలింపిక్స్‌లో మెడల్స్ సాధించిన క్రీడాకారులకు బహూకరించారు. ఒక్క రోజంతా క్రీడాకారులను ఊరేగించారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భారీ నజరానాలు ప్రకటించాయి. మరి ప్రపంచ కప్ గెలిచిన భారత కబడ్డీ జట్టు సభ్యులు చేసిన పాపమేంటి..? రూ.10 లక్షలు ముష్టి వేసి చేతులు దులుపుకున్నారు. ఈ లెక్కన చూస్తే జట్టులోని ఒక్కో సభ్యుడికి దక్కింది కేవలం రూ.67వేలన్నమాట. కబడ్డీ ప్రపంచ కప్ గెలిచిన వెంటనే కబడ్డీ క్రీడను ఒలంపిక్స్‌లో చేర్చాలన్న ప్రభుత్వ పెద్దలు ఆతర్వాత పత్తా లేకుండా పోయారు.
2011లో భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలిస్తే జట్టులోని ఒక్కో ఆటగాడికి రూ.1.3 కోట్లు బహుమతిగా ఇచ్చారు. కొన్ని కార్పోరేట్ సంస్థలైతే కార్లు, బంగ్లాలు కూడా బహూకరించాయి. ఇప్పుడు కబడ్డీ ప్రపంచ కప్ గెలిచిన ఆటగాళ్లకు ఇచ్చిన నగదుతో పోలిస్తే క్రికెటర్స్‌కు ఇచ్చిన నగదు ఎన్నో రెట్లు ఎక్కువ.
64 పాయింట్లతో భారత కబడ్డీ జట్టు కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించిన అజయ్ ఠాకూర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రపంచకప్ గెలిస్తే తమను సత్కరించేవారు లేకపోయారన్నారు. కనీసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమను గుర్తించలేదని, నగదు బహుమతులను ఇవ్వకపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని అజయ్ ఠాకూర్ అన్నారు. సన్మానాలు, సత్కారాలు, బహుమతులు వద్దు. కబడ్డీ ప్రాక్టీస్ సాధారణ మైదానంలో చేస్తున్నాం. సాధన కోసం టర్ఫ్ ఏర్పాటు చేస్తే చాలు. అంతకంటే కోరుకునేదేమీ లేదు అని అజయ్ చెప్పాడు.
ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులోని ఆటగాళ్లను ప్రభుత్వం పట్టించుకోవాలని, దేశానికి గర్వకారణమైన ఆటగాళ్లు ఆర్థికంగా స్థిరపడేందుకు ప్రభుత్వం సాయం చేసి, వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని కబడ్డీ అభిమానులు క్రీడా పండితులు గవర్నమెంట్‌ను డిమాండ్ చేశారు.
loading...
No comments:
Post a Comment