Latest News

హోంలోన్‌కు మీరు అర్హులేనా ?

loading...

సొంతింటి కల నెరవేర్చుకునేందుకు హోమ్‌లోన్‌ చక్కటి మార్గం. గృహరుణం మంజూరు కావాలంటే అనేక అర్హతలు ఉండాలి. అన్ని అర్హతలు ఉన్నా అప్పు ఇచ్చే బ్యాంకులు, గృహ ఫైనాన్స్‌ కంపెనీలు సవాలక్ష షరతులు పెడుతుంటాయి. హోమ్‌ లోన్‌ కోసం ముందే ఎలా సిద్ధం కావాలో బ్యాంక్‌బజార్‌ టీమ్‌ వివరిస్తోంది.

ఎవరికైనా గృహ రుణాలు ఇవ్వాలంటే బ్యాంకులు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు కింది విషయాలను పరిగణనలోకి తీసుకుంటాయి. అవేంటంటే...

అర్హతలు : అన్ని అర్హతలు కలిగి ఉన్న వ్యక్తులకే హోమ్‌ లోన్‌ లభిస్తుంది. ఇందుకోసం ఒక్కో బ్యాంక్‌ ఒక్కో ప్రామాణికాలు పాటిస్తుంది. ముందుగా బ్యాంక్‌ పేర్కొన్న హోమ్‌ లోన్‌ అర్హత మీకు ఉందా? లేదా? అనే విషయం నిర్ధారించుకోవాలి. ఆ తర్వాతే ఆ బ్యాంక్‌ నుంచి హోమ్‌ లోన్‌ కోసం దరఖాస్తు చేయాలి.

ఆదాయం : మీ ఆదాయం మీరు తీసుకునే హోమ్‌ లోన్‌ని తిరిగి చెల్లించేంత స్థాయిలో ఉండాలి. అలా లేదని బ్యాంక్‌ భావిస్తే, మరో వ్యక్తిని సహ రుణ గ్రహీత(కో బారోవర్‌)గా తీసుకు రమ్మని బ్యాంక్‌ కోరవచ్చు. ఈ విషయంలో ముందే జాగ్రత్త పడితే వెంటనే హోమ్‌ లోన్‌ లభిస్తుంది. లేకపోతే బ్యాంక్‌ చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా లోన్‌ మంజూరు కాదు.

డౌన్‌ పేమెంట్‌ : హోమ్‌ లోన్‌ ఇచ్చే బ్యాంక్‌ ఒక్కోసారి మనం అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తాన్ని ముందే డౌన్‌ పేమెంట్‌ చేయమని కోరవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అదనపు నిధులతో ముందే సిద్ధమై ఉండాలి.

సర్టిఫికెట్లు : అన్ని సర్టిఫికెట్లు పక్కాగా ఉంటే తప్ప హోమ్‌ లోన్‌ లభించదు. లోన్‌ కోసం దరఖాస్తు చేసే నాటికే చిరునామా, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఐటి రిటర్న్‌లతో సిద్ధమై ఉండాలి. కొన్ని రాష్ట్రాల్లో స్థానిక నివాసులనే ధ్రువీకరణ పత్రాలు కావాలి.

క్రెడిట్‌ స్కోరు : ప్రస్తుతం హోమ్‌ లోన్లు పొందేందుకు ఆయా వ్యక్తుల క్రెడిట్‌ స్కోరుది కీలక పాత్ర. ఈ స్కోరు కనీసం 750 పైన ఉండాలి. అలా ఉంటేనే బ్యాంకులు మంచి ఆఫర్‌తో హోమ్‌ లోన్లు ఇస్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని హోమ్‌ లోన్లు తీసుకోవాలనుకునేవారు తమ క్రెడిట్‌ కార్డు బిల్లులు, ఇతర రుణాలపై చెల్లించాల్సిన ఈంఐలను క్రమం తప్పకుండా చెల్లించాలి. లేకపోతే మీ క్రెడిట్‌ స్కోరు పడిపోయి హోమ్‌ లోన్‌ కాదగదా, ఏ లోనూ దొరకదు.

ముందే తెలుసుకోవడం : హోమ్‌ లోన్‌ కావాలనుకున్నపుడు ముందుగానే ఆయా బ్యాంక్‌లకు వెళ్లి, అధికారులను సంప్రదించాలి. దీని వలన హోమ్‌ లోన్‌ అర్హత, రుణ ప్రాసెసింగ్‌ కోసం బ్యాంక్‌ వసూలు చేసే ఛార్జీలు, వడ్డీ రేటు, ఏయే పత్రాలు అవసరం వంటి విషయాలు ముందే తెలుసుకుని జాగ్రత్త పడవచ్చు.

ఇతర ఖర్చులపై అవగాహన : హోమ్‌లోన్‌తో ఇల్లు కొనుక్కున్నాక, కొన్ని ఖర్చులు ఉంటాయి. అపార్టెమెంట్లలో ఫ్లాట్‌ అయితే నిర్వహణ ఖర్చులు, సెక్యూరిటీ ఛార్జీలు, కారు పార్కింగ్‌ ఛార్జీలు వంటి అనేక ఖర్చులు తప్పవు. వీటిపైనా సరైన అవగాహన ఉంటే ముందే జాగ్రత్త పడవచ్చు.
తిరిగి చెల్లించే సామర్థ్యం.

అప్పు చేసి పప్పు కూడు తినొద్దనేది పెద్దల మాట. ప్రస్తుతం మధ్యతరగతి ప్రజలైనా సొంతిల్లు కావాలంటే అప్పు చేయక తప్పట్లేదు. అలా అని స్థోమతకి మించి అప్పు చేస్తే, ఈంఐల రూపంలో ఉన్న ఆదాయమంతా అది చెల్లించేందుకే పోతుంది. అపుడు కనీస అవసరాలతో పాటు, అత్యవసర ఖర్చుల కోసం మరిన్ని అప్పులు చేయాల్సి రావచ్చు. ప్రస్తుత ద్రవ్యోల్బణ రేటుతో పాటు, భవిష్యత్‌లో అది ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది? ఈ లోపు ఎదురయ్యే ఆదాయ, ఖర్చుల ప్రకారం ఈంఐలు నిర్ణయించుకోవాలి.

చెల్లింపు గడువు ఎంపిక:

ముందు ముందు మీ ఆదాయ పెరుగుదల ఎలా ఉంటుందనే విషయం ఆధారంగా హోమ్‌ లోన్‌ చెల్లింపు గడువును నిర్ణయించుకోవాలి. ప్రారంభంలో ఈంఐల చెల్లింపు కష్టమనిపించినా, ఖర్చుల కంటే ఆదాయం పెరిగే కొద్దీ పెద్ద కష్టమనిపించదు. ఎక్కువ గడువు ఎంచుకుంటే ప్రారంభం నుంచే తక్కువ ఈంఐల చెల్లింపుల భారం పడుతుంది. ఆదాయం పెరిగిన వెంటనే వీలైతే హోమ్‌లోన్‌ని గడువు కంటే ముందే చెల్లించవచ్చు. ఇపుడు హోమ్‌ లోన్‌ను ముందుగా చెల్లించినా పెనాల్టీ ఛార్జీలు లేవు.
loading...

No comments:

Post a Comment

Teenmar News | Online English, Telugu,Telangana News Portal Designed by Templateism.com Copyright © 2014

Powered by Blogger.