loading...
ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో, ముఖ్యంగా ఇటు రాయలసీమ, అటు బళ్లారి, చిత్రదుర్గ జిల్లాల్లో ఓబవ్వ, ఓబులమ్మ, ఓబులయ్య పేర్లు ఎక్కువగా వినిస్తుంటాయి.
అందుకు బలమైన కారణమే ఉందని, ఈ పేర్ల వెనుక గొప్ప చరిత్ర ఉందని స్థానిక ప్రజలు బలంగా నమ్ముతారు.
ఓబమ్మ అనే వీరనారికి గుర్తుగా ఈ పేర్లు పెట్టుకుంటున్నామని చిత్రదుర్గం వాసులు అంటారు. ఆ మహిళ కథ చిత్రదుర్గంలో బాగా ప్రచారంలో ఉంది.
ఎవరా మహిళ? ఏమా కథ?
ఆ వీరనారి కథ 200 ఏళ్ల నాటిదని స్థానికులు చెబుతారు.
వారి కథనం ప్రకారం, రెండు వందల ఏళ్ల క్రితం చిత్రదుర్గను చాళుక్యులు, రాజకూటులు, హోసులు అనంతరం.. మదాకరి నాయకులు పాలించారు.
మదాకరి నాయకుల కోటపై హైదర్ అలీ సైన్యం తరచూ దాడులు చేసేది. అలాంటి దాడులను మదాకరి నాయకుల సైన్యం తిప్పికొడుతూ ఉండేది.
మదాకరి నాయకుల కోటలో ఓ చోట రహస్య గుహ ఒకటి ఉంది. ఆ గుహ దగ్గర ఓరోజు మధ్యాహ్నం ఒక భటుడు కాపలా కాస్తున్నాడు.
మధ్యాహ్నం పూట భోజనం చేయడానికి ఆ భటుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అదే సమయంలో అతడి భార్య నీళ్లు మోస్తూ ఉంది. నీళ్లు మోస్తున్న ఆ మహిళ ఆ ప్రాంతంలో శత్రువులున్నట్టు పసిగట్టింది.
ఆమె పేరే ఓబవ్వ!
★★★★★★★★★★★★
శత్రువుల అలికిడి పసిగట్టాక ఈ విషయాన్ని భర్తకు చెబుదామని వెళ్లింది ఓబవ్వ. కానీ తన భర్త అప్పుడే భోజనానికి కూర్చున్నాడు.
భోంచేస్తున్న భర్తకు విషయం చెప్పలేక పోయింది. కానీ అక్కడ శత్రువులు ఉన్నారు. ఇది ఉపేక్షించే సమయం కాదు.
వడ్లు దంచే పొడవైన రోకలి ఒకటి ఆమె కంట పడింది. అంతే.. ఆమె ఆ రోకలినందుకుంది. వారిని ఒంటరిగానే ఎదుర్కోవడానికి సిద్ధమైంది. కదన రంగంలో దూకింది. శత్రువులపై రోకలితో విరుచుకుపడింది.
ఓబమ్మ ధాటికి శత్రువులు కొందరు మట్టికరిచారు. ఇంకా కొందరు మిగిలే ఉన్నారు.
ఇంతలో భోజనం ముగించుకుని ఆ భటుడు అక్కడకు వచ్చాడు. వెంటనే ఆయనా రంగంలోకి దిగి తన భార్యకు తోడుగా పోరాడాడు. చివరికి శత్రువులు హతమయ్యారన్నది ప్రచారంలో ఉన్న కథ.
ఆ రోజు.. ఓబమ్మ చూపిన తెగువ హైదర్ అలీ సైనికుల నుంచి చిత్రదుర్గ కోటను కాపాడింది.
కొంత కాలానికి మదాకరి నాయకుడు హైదర్ అలీ చేతిలో ఓడిపోయాడు. కానీ ఓబవ్వ వీర వనితగా చరిత్రలో మిగిలిపోయింది.
నేటికీ ఆమె వీరత్వాన్ని తలుచుకుని స్థానికులు పులకరిస్తారు. ఆమె మీద గౌరవంతోనూ, ఆమె జ్ఞాపకాలతోనూ ముడిపడిన ఆ ప్రాంతాల్లో ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంటుందని కొందరి అభిప్రాయం.
ఆ వీరనారి వంశానికి చెందిన రంగప్ప ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్నారు. ఓబవ్వ శత్రువులతో పోరాడిన ఆ గుహ దగ్గరే ఆయన 'ఉరుము' వాయిద్యాన్ని వాయిస్తూ ఉంటారు. పర్యాటకులు ఇచ్చిన డబ్బులు తీసుకుని జీవిస్తున్నారు.
తమది ఓబవ్వ వంశం అంటూ గర్వంగా చెప్పుకుంటారు రంగప్ప.
ఆత్మవిశ్వాసానికి, ధైర్యసాహసాలకు మారు పేరుగా చరిత్రకెక్కిన ఓబవ్వను ప్రజలు గుర్తుంచుకోవాలని భావించి కర్ణాటక ప్రభుత్వం చిత్రదుర్గం కమిషనర్ కార్యాలయం ఎదుట ఆమె విగ్రహం ఏర్పాటు చేసింది.
loading...
No comments:
Post a Comment