Latest News

బోదిధర్మ భారతీయుడే .......ఆయన సమాధిలో ఏం దొరికింది అంటే?

loading...
కరోనా వైరస్ పీడిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బోదిధర్మ గురించి తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. బోదిధర్మ అసలు పేరు ధర్మ వర్మ. ఆయన ఐదో శతాబ్దంలో తమిళనాడులోని కంచిపురం పాలిస్తున్న రాజు స్కందవర్మ మూడో కుమారుడు. నాటి పల్లవ సామ్రాజ్యానికి మూడో తెలుగు చక్రవర్తిగా చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఆయన ఏ భాషస్తులనే విషయంపై భిన్నవాదనలు ఉన్నాయి. కంచిపురంలో జన్మించడం వల్ల ఆయన తమ రాష్ట్రం వారనేనని తమిళులు పేర్కొంటున్నారు. అంతేకాదు, బోదిధర్మను ఆరాదించేవాళ్లు కూడా తమిళనాడులోనే ఎక్కువ.

ఓ రోజు ప్రజ్ఞతార అనే బౌద్ధ సన్యాసి స్కందవర్మ కోటకు వచ్చాడు. ధర్మ వర్మ కోసం అక్కడ ఓ లేఖను వదిలి వెళ్లారు. అందులో ‘‘జననానికి ముందు నీవెవ్వరు? జన్మించిన తర్వాత నీవెవ్వరూ’’ అని రాసి ఉంది. ఆయన అలా ఎందుకు రాశారో ధర్మకు అర్థం కాలేదు. దాని సమాధానం కోసం నిద్రలేని రాత్రులు గడిపారు. దానికి జవాబు తెలుసుకోడానికి ప్రజ్ఞతార ఆశ్రమానికి వెళ్లారు. ప్రజ్ఞతారను కలిసినా బోదిధర్మకు సమాధానం లభించలేదు. నీకు నువ్వుగానే దీనికి సమాధానం వెతుక్కోవాలని ప్రజ్ఞతార చెప్పారు. ‘‘బంధాలకు, సుఖాలకు, అధికారాలకు లోనై ఉన్నంత కాలం ఈ ప్రశ్నకు సమాధానం లభించదు. ఇందుకు నీవు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవాలని ప్రజ్ఞతార చెప్పారు. దీంతో ధర్మ.. తన రాజ్యాన్ని వదిలి ఆశ్రమంలోనే ఉంటానని చెప్పాడు. బౌద్ధ సన్యాసాన్ని స్వీకరించి ప్రజ్ఞతార వద్ద శిష్యరికానికి చేరాడు. గురువు ధర్మ వర్మ పేరును బోది ధర్మగా మార్చారు.

బోది ధర్మలో మానసిక స్థైర్యం ఉన్నా.. శారీరక శక్తి చాలా తక్కువగా ఉందని గురువు గమనించారు. ఈ సందర్భంగా కొన్నాళ్లు యుద్ధ విద్యలు నేర్చుకోవాలని సూచించారు. దీంతో బోదిధర్మ దేశమంతా తిరిగి యోగాతోపాటు పలు మర్మవిద్యలు నేర్చుకున్నారు. నాలుగేళ్ల తర్వాత శారీరక, మానసిక దృఢత్వంతో తిరిగి ఆశ్రమానికి చేరిన బోదిధర్మకు గురువు అసలు రహస్యాన్ని తెలిపారు. ‘‘నువ్వు సాధారణ సన్యాసివి కావు. నీ పుట్టకకు ఓ కారణం ఉంది. నువ్వు మరో బుద్ధుడిగా బౌద్ధమతాన్ని, దాని ఉద్దేశాలను విశ్వవ్యాప్తం చేయాలి’’ అని గురువు పేర్కొన్నారు. చైనాలో 1వ శతాబ్దం నుంచే బౌద్ధ మతం వ్యాపించి ఉంది. అయితే, అక్కడి ప్రజలు పూర్తిగా బౌద్ధ ధర్మాలను పాటించకుండా బుద్ధి హీనులుగా మారడాన్ని గురువు ప్రజ్ఞతారను కలిచి వేసింది. అక్కడ బౌద్ధ ధర్మాన్ని రక్షించేందుకు రెండో బుద్ధుడిగా వెళ్లాలని బోదిధర్మను ఆదేశించారు. అక్కడ అడుగు పెట్టడానికి ముందు.. బౌద్ధ గ్రంథాలు, చైనా భాషా.. సాంప్రదాయాల మీద అవగాహన తెచ్చుకోవాలని పేర్కొన్నారు.

గురువు ఆదేశాల మేరకు బోదిధర్మ తనకు 40 ఏళ్ల పాటు కఠోరంగా శ్రమించి బౌద్ధ గ్రంథాలపై పట్టు సాధించారు. 67 ఏళ్ల వయస్సులో సముద్ర మార్గంలో చైనాకు బయల్దేరారు. లియాంగ్ అనే రాజ్యానికి చేరుకున్న బోదిధర్మకు అక్కడి రాజు ‘వు’ ఆహ్వానం పలికారు. బోదిధర్మ చైనాలో అడుగు పెట్టడానికి కారణం తెలుసుకుని రాజు కొన్ని వ్యక్తిగత సందేహాలను తీర్చుకోవాలని భావించాడు. తాను ఎన్నో దానధర్మాలు చేస్తానని, బౌద్ధ సన్యాసులను పోషిస్తున్నానని తెలుపుతాడు. ఇన్ని పుణ్యాలు చేస్తున్నందుకు తాను స్వర్గానికి వెళ్తానా లేదా నరకానికి వెళ్తానా? అని అడిగాడు. రాజు అడిగిన ప్రశ్నకు బోదిధర్మ సమాధానం చెబుతూ.. ‘‘నువ్వు తప్పకుండా నరకానికే వెళ్తావు. నీవు ధనం ద్వారా పుణ్యాన్ని కొంటున్నావు. అంటే, మనసుతో దానం చేయడం లేదు. స్వర్గానికి వెళ్లాలనే స్వార్థంతో పుణ్యాత్ముడిగా భావిస్తున్నావు. ఇలాంటివారు తప్పకుండా నరకానికే పోతారు’’ అని బోదిధర్మ తెలిపారు. అంతే, ఆ సమాధానం వినగానే రాజుకు కోపం వచ్చింది. వెంటనే అతన్ని కోట వదిలి వెళ్లాలని రాజు ఆదేశిస్తాడు. దీంతో బోది ధర్మ అక్కడి నుంచి ఉత్తర చైనాను చేరారు.

బోదిధర్మను అక్కడి ప్రజలు బౌద్ధ గురువుగా కాకుండా భారతీయుడిగానే చూసేవారు. భారతీయులు ఆహారాన్ని చాప్ స్టిక్స్‌తో కాకుండా చేతులతో తింటారని, మలాన్ని కూడా చేతులతోనే శుభ్రం చేసుకుంటారని, పరిశుభ్రంగా ఉండరంటూ ఎవరూ బోదిధర్మకు ఆశ్రయం కల్పించేవారు కాదు. దీంతో ఆయన షావోలిన్ అనే ప్రాంతంలోని ఓ గుహలో ధ్యానం చేయడం మొదలు పెట్టారు. అలా తొమ్మిదేళ్లపాటు ఎవరితో మాట్లాడకుండా బోదిధర్మ పూర్తిగా ద్యానంలోనే ఉన్నారు. ఈ విషయం తెలిసి దాజూ ల్యూక్ అనే సన్యాసి శిష్యుడిగా చేరేందుకు ఆసక్తి చూపించాడు. కఠోర ధ్యానంలో ఉన్న బోది ధర్మ ల్యూక్ విన్నపాన్ని పట్టించుకోరు. దీంతో ల్యూక్ ఆయనతోనే గడుపుతాడు. అక్కడి వాతావరణం మైనస్ డిగ్రీలకు పడిపోయినా సరే బోది ధర్మ వద్దే కుర్చొని ఎదురు చూసేవాడు. చివరికి ఓ రోజు తన కత్తితో చేతిని నరికేసుకుంటాడు. ఆ రక్తం బోదిధర్మపై పడుతుంది. దీంతో బోదిధర్మ కళ్లు తెరిచి చూస్తారు. అనంతరం ల్యూక్‌ను తన శిష్యుడిగా చేర్చుకుంటారు. అతడి పేరును షెన్ గ్యాంగ్‌గా మారుస్తాడు. తొమ్మిదేళ్లు ధ్యానంలోనే ఉన్న బోదిధర్మను ప్రజలు బుద్ధుడి మరో అవతారంగా భావిస్తారు. ఈ విషయం చైనా మొత్తం పాకుతుంది. అక్కడి నుంచి జపాన్, కోరియా తదితర దేశాలకు కూడా బోదిధర్మ బోధనలు విస్తరించాయి. దీంతో ఆయనకు ఆసియాలోని ఇండియా మినహా అన్ని దేశాల నుంచి శిష్యరికానికి చేరారు. వీరికి బోధి ధర్మ.. తాను భారత దేశంలో నేర్చుకున్న యోగా తదితర మర్మ కళలను మేళవించి కుంగ్‌ఫూను నేర్పించారు.

చైనాకు కుంగ్‌ఫూను నేర్పించినది బోదిధర్మ అనే ప్రచారం ఉంది. బోదిధర్మ నేర్పించిన విద్యను షావోలిన్ కుంగ్‌ఫూ అంటారు. ఇది కుంగ్‌ఫూ కంటే మెరుగైనది, కష్టమైనది కూడా. భారతీయ యుద్ధ కళలను మేళవించి ఈ కుంగ్‌ఫూ రూపొందించారు. ఈ విద్య చైనా ప్రజలకు ఎంతో ఉపయోగపడింది. ఆత్మరక్షణకు పనికొచ్చింది. అంతేగాక బోదిధర్మ ఆయుర్వేద వైద్యం ప్రజలకు ఎంతో ఉపయోగపడింది. బౌద్ధ ధర్మ బోధనలు చేస్తూ బోదిధర్మ చైనా ప్రజలకు దైవంగా మారారు. 28వ బౌద్ధ ఆచార్యుడిగా గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా భారత దేశంలో నేర్చుకున్న మహాయాన సూత్రాలను బౌద్ధ ధర్మలతో మేళవించి ‘చాన్ బుద్ధిజం’ను సృష్టించారు. చైనాలో బోదిధర్మను దాము అని, జపానులో ధర్మ అని పిలిచేవారు. బోదిధర్మ తర్వాత ఆయన శిష్యుడు షేన్ గ్యాంగ్ 29వ బౌద్ధ ఆచార్యుడిగా బాధ్యతలు స్వీకరించారు. గురువుకు ఇచ్చిన మాట ప్రకారం.. చైనాలో బౌద్ధ ధర్మాన్ని వ్యాప్తిచేసిన బోదిధర్మ ఇండియాకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని తన శిష్యులకు తెలిపి.. షేన్ గ్యాంగ్‌ను ఇక గురువుగా స్వీకరించాలని ఆదేశించారు. అయితే, బోదిధర్మ తమని విడిచి వెళ్లకూడదనే ఉద్దేశంతో ఓ శిష్యుడు ఆహారంలో విషం కలిపి బోదిధర్మను చంపేశాడని, బోదిధర్మ బౌతిక కాయాన్ని ఓ పర్వతం ప్రాంతంలో సమాధి చేశారని చెబుతారు. అయితే అది అసత్యమని బోదిధర్మ 170 ఏళ్ల వయస్సులో 536లో చనిపోయారనే వాదన ఉంది.

చైనా ప్రజలు బోదిధర్మ చనిపోయారంటే నమ్మరు. ఇందుకు మరో కథ ప్రచారంలో ఉంది. బోదిధర్మ చనిపోయాడని భావిస్తున్న రోజుల్లో ఓ సైనికుడికి చైనా సరిహద్దుల్లో బోదిధర్మ ఒక బూటును చేతితో పట్టుకుని నడుస్తూ కనిపిస్తారు. ఈ సందర్భంగా సైనికుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నిస్తే.. నా స్వదేశానికి తిరిగి వెళ్తున్నా అని చెబుతారు. త్వరలో మీ రాజు చనిపోతారని బోదిధర్మ అతనికి తెలుపుతారు. తాను బతికే ఉన్నానని చెబితే నువ్వు కష్టాల్లో పడతావని హెచ్చరించి అక్కడికి నుంచి వెళ్లిపోతారు. అయితే, ఆ సైనికుడు బోది ధర్మ బతికే ఉన్నాడని, తాను చూశానని రాజుకు చెబుతాడు. అసత్యం చెబుతున్నావంటూ రాజు అతన్ని జైల్లో బంధిస్తాడు. బోది ధర్మ సమాధిని తవ్వి చూడగా అక్కడ కేవలం ఒక బూటు మాత్రమే లభ్యమవుతుంది. దీంతో రాజు బోది ధర్మ బతికే ఉన్నాడని భావిస్తారు. కొద్ది రోజలు తర్వాత రాజు కూడా చనిపోతాడు. అప్పటి నుంచి చైనా ప్రజలు బోదిధర్మకు మరణం లేదని, ఆయన బతికే ఉండి ఉంటారని నమ్ముతున్నారు.
loading...

No comments:

Post a Comment

Teenmar News | Online English, Telugu,Telangana News Portal Designed by Templateism.com Copyright © 2014

Powered by Blogger.